దశావతారాలు సైన్స్ : దశావతారాల-వెనుక-దాగి-వున్న సైన్స్, పంచంలో జనులంతా ఒకే రకంగా ఉండరు , కొందరు మంచివాళ్లు మరి కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు . మంచివాళ్లు ధర్మాన్ని నమ్ముతారు ఆచరిస్తారు , చెడ్డ వాళ్ళు ధర్మాన్ని నమ్మరు ఆచరించరు కూడా . ఒక్కోసారి చెడ్డవాళ్లదే పై చెయ్యి కావచ్చు , అప్పుడు ధర్మం నశించి పోతుంది. ధర్మాన్ని నిలబెట్టటం కోసం భగవంతుడే భూలోకంలో అవతరించి దుష్టులను శిక్షించి మంచి వాళ్లని రక్షిస్తాడు .
ఇలా భగవంతుడు భూలోకం లో అవతరించటాన్ని అవతారాలు అంటారు. సృష్టి స్థితి లయల్లో విష్ణువు పోషించి రక్షించేవాడు . ఈ స్వామి అవతారాలు అనంతం .
ఈ అవతారాల్లో పదింటిని మాత్రం ఎక్కువగా చెప్తారు. వీటినే దశావతారాలు అంటారు.
1. మొదటి అవతారం మత్సావతారం

యుగాల్లో మొదటిదైన కృత యుగంలో సోమకుడనే రాక్షసుడు భ్రహ్మ దగ్గర ఉన్న వేదాల్ని దొంగిలిస్తాడు. అప్పుడు విష్ణువు సముద్రంలో దాక్కుని ఉన్న సోమకాసురుణ్ణి మత్స రూపంతో వెదికి , పట్టుకొని సంహరిస్తాడు . జ్ఞాన నిధి అయిన వేద రాశిని మరల బ్రహ్మదేవుడికి ఇస్తాడు.
2. కూర్మావతారం

ఒకప్పుడు దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలకాలనుకొంటారు, మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు, వాసుకి అనే సర్ప రాజు తాడు అయ్యాడు. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికేవారయ్యారు . సముద్ర మధనం సాగింది, ఆ సమయం లో పర్వతం మునిగి పోకుండా ఉండేందుకు కూర్మావతారం లో మహావిష్ణువు కాపాడుతాడు . కూర్మం అంటే తాబేలు.
3. వరాహావతారం

కృత యుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు లోకాల్ని బాధించేవాడు, ఈ రాక్షసుడు భూమిని పాతాళానికి నెట్టేసి , అల్లకల్లోలం చేస్తాడు. ఇది భరించలేక భూదేవి విష్ణువుతో మొరపెట్టుకోగా, ఆయన వరాహావతారం లో వచ్చి హిరణ్యాక్షున్నీ చంపి భూదేవిని కాపాడుతాడు.
4. నారసింహావతారం

హిరాణ్యాక్షుణ్ణి చంపినందుకు అతని తమ్ముడు హిరణ్యకశపుడు కోపంతో తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి, సామాన్యులు కోరని కోరికలు కోరి వరాలు పొందాడు. భ్రహ్మ ప్రసాదించిన వరాలతో భగవంతుణ్ణి వెదుకుతూ ఉన్నాడు . ఈ ప్రయత్నంలో తన కన్నకొడుకు అయిన ప్రహ్లాదుణ్ని కూడా హింసించాడు. హరినామం జపిస్తున్న కుమారుణ్ణి ఇలా అడిగాడు
హిరణ్యకశపుడు : మీ హరి ఎక్కడున్నాడు రా ?
ప్రహ్లాదుడు : అక్కడ , ఇక్కడ కాదు నాన్న ఎక్కడైనా ఉంటాడు.
హిరణ్యకశపుడు : ఈ స్తంభంలో ఉంటాడా మీ హరి ?
ప్రహ్లాదుడు : అవును ఉంటాడు
హిరణ్యకశపుడు స్తంభాన్ని పగలగొడతాడు , స్తంభం లో నుండి నారసింహావతారం లో వచ్చి హిరణ్యకశపుడిని చంపుతాడు.
5. వామనావతారం

పూర్వం బలి చక్రవర్తి అనే రాక్షసుడు దేవతలపై దౌర్జన్యం చేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు . రాక్షసులలో కూడా కొంతమందికి మంచి గుణాలు ఉంటాయి. బలిచక్రవర్తికి కూడా దానం చేసే మంచి అలవాటు ఉండేది. దేవతల కోరిక మేరకు విష్ణువు వామనావతారం ఎత్తాడు. వామనుడు అనగా పొట్టివాడు అని అర్థం. వామనుడు, యాగం చేస్తున్న బలిచక్రవర్తి ని మూడడుగుల స్థలం అడిగాడు. బలి చక్రవర్తి అందుకు అంగీకరిస్తాడు. అంతే! వామనుడు విశ్వమంతా వ్యాపిస్తాడు, ఒక అడుగుతో ఆకాశాన్ని, మరొక అడుగుతో భూమిని ఆక్రమిస్తాడు. మూడవ అడుగు బలిచక్రవర్తిపై పెట్టి పాతాళానికి పంపించేస్తాడు. అందుకే ఈయనను త్రివిక్రముడు అంటారు. త్రివిక్రముడు అంటే మూడు లోకాల్లో వ్యాపించినవాడు అని అర్థం.
6. పరశురామావతారం

ఈ అవతారం లో ఇరవై ఒక్క సార్లు దుర్మార్గులైన రాజులందర్నీ తన గండ్ర గొడ్డలితో చంపి భూభారం తగ్గించాడు. గండ్రగొడ్డలిని పరశువు అంటారు. ఈ అవతారంలో పరశువు ని చేతపట్టి పరశురాముడు అయ్యాడు.
7. శ్రీరామావతారం

త్రేతాయుగం లో రావణాసురున్ని సంహరించడానికి విష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు, దేవతలు వానరులుగా పుట్టారు.
శ్రీరాముడు దశరథుడి కుమారుడు మరియు ఈ అవతారం గురించి మనందరికీ తెలుసు. రాముడి పట్టాభిషేక సమయానికి సవతి తల్లి కైకై అరణ్యవాసం చేయమని అడగటం, తండ్రిపై అభిమానంతో రాముడు సీతాసమేతంగా అడవులకు వెళ్ళటం, సీతను రావణుడు అపహరించటం తర్వాత రాముడు వానర సైన్యం సహాయంతో రావణుణ్ణి చంపుతాడు. ఇదంతా మనకు తెలిసిందే.
8. శ్రీకృష్ణావతారం

ద్వాపర యుగంలో విష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడు. చిన్న వయసులోనే అనేక రాక్షసులను చంపుతాడు. ధర్మ మార్గంలో నడిచే పాండవులకు అండదండలుగా ఉంటాడు. అవసరమైన సమయాలల్లో సహాయం చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలైన సందర్భంలోఅర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. అందువల్ల కృష్ణుడు “కృష్ణం వందే జగద్గురుమ్” అని జగద్గురుగా ప్రసిద్ధికెక్కినాడు.
9. బౌద్దావతారం

పూర్వం త్రిపురులనే రాక్షసులు ఉండేవారు. వాళ్లను సంహరించటం కోసమే విష్ణువు బౌద్దావతారం ఎత్తాడు అని పురాణాలూ చెప్తాయి. అహింస మార్గాన్ని ఉపదేశించిన బుద్దున్ని ఒక అవతారంగా చెప్తారు.
10. కల్కి అవతారం

కలియుగం చివర్లో దుర్మార్గం పెరిగినపుడు విష్ణువు కల్కి గా అవతరించి, దుష్టులను శిక్షించి మంచి వాళ్లని రక్షిస్తాడని చెబుతారు .
ఈ 10 అవతారాల్లో కొందరు బౌద్దావతారానికి బదులు బలరామ అవతారాన్ని చేరుస్తారు.
ఈ దశావతారాలు గాక మరెన్నో అవతారాలు ఉన్నాయి. కొన్ని పురాణాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా ( అర్చారూపంగా) అవతరిస్తాడని వుంది .
ఇది ఇలా ఉంటే ఈ దశావతారాలు పురాణాల్లో చెప్పిన దేవుడి అవతారాలు మాత్రమే కాదు, ఇందులో కూడా సైన్స్ వుంది.
ఈ 10 అవతారాలను మనం గమనిస్తే జీవి పుట్టుక సముద్రం నుండి మొదలయ్యి వివిధ రకాలుగా రూపాంతరం చెంది అడవి మనిషి నుండి సంఘ జీవిగా ఎలా మారాడో తెలియజెప్పేదే ఈ దశావతారాలు.
విష్ణు అవతారం అంటే భూమి ఆవిర్భావంతో పోల్చుతారు. భూమి ఆవిర్భావం తర్వాత మొత్తం నీటితో నిండి ఉంటుంది. జీవి ఆవిర్భావం సముద్రం నుండే మొదలవుతుంది. ఇదే మత్సావతారం. జీవి నీటిలో కాకుండా భూమిపై కూడా నిలదొక్కుకోవటమే కూర్మావతారం .

ఉభయచర జీవి పూర్తిగా భూమిపై కి మారే క్రమమే వరాహావతారం అని చెప్తారు. జంతువు నుండి మనిషికి మారే క్రమాన్ని నరసింహావతారంగా చెప్తారు. జంతువు పూర్తిగా మానవునిగా పరిణితి చెందడమే వామనావతారం. పూర్తి మనిషిగా మారిన తర్వాత అడవిలో గొడ్డలితో జీవించటమే ఈ పరశురామ అవతారం. అడవి మనిషి నుండి సంఘ జీవిగా మారే దశనే రామావతారంగా చెప్తారు. మనిషి బుద్ధి బలంతో సమస్యలను తనంతట తానె పరిష్కరించుకోవడం, సంగీతం వినడం వంటి మార్పులని కృష్ణావతారంగా చెప్తారు. మనిషి జ్ఞానోదయం చెందే మార్పునే బుద్ధావతారంగా చెప్తారు.
పుట్టిన జీవి గిట్టక తప్పదు అలాగే ఈ ప్రపంచం కూడా అంతం అయ్యి మరలా వృద్ధి చెందుతుంది, జీవులు అంతరించి ఈ ప్రపంచం మళ్ళీ మొదలవుతుంది అని చెప్పటమే కల్కి అవతారం
ఈ వ్యాసం మీకు నంచినట్టయితే లైక్ చెయ్యండి,కామెంట్ చెయ్యండి మరియు షేర్ చెయ్యండి .
మీ సలహాలను సందేహాలను yuvataram12@gmail.com కు పంపండి.
ధన్యవాదాలు